
రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అడ్డాకుల: 44వ నంబర్ జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. బైక్‌పై వెళ్తున్న యువకులు అదుపుతప్పి కిందపడగా.. వారిపైనుంచి వెనకాలే వస్తున్న వాహనం దూసుకెళ్లడంతో శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లికి చెందిన యువకుడు గణేశ్(20), ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన రాజు(21) పల్సర్‌పై కొత్తకోట వైపు నుంచి హైవేపై వెళ్తున్నారు. శాఖాపూర్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. వారి వెనుకే వస్తున్న గుర్తు తెలియని వాహనం యువకుల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరి శరీరాలు చిధ్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యువకులపై నుంచి వెళ్లిన వాహనం అక్కడి నుంచి తప్పించుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు యువకుల మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో రాజు చర్లపల్లికి చెందిన యువతితో వివాహమై అక్కడే ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి కూతురు ఉంది. అదేవిధంగా గణేశ్ మత్స్యకారుడిగా పని చేస్తుండగా వివా హం కాలేదని సమాచారం. కాగా ఇద్దరు యు వకులు బైక్‌పై ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదు. ప్రమాదఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● అదుపుతప్పిన బైకు..
యువకులపై వెళ్లిన వాహనం
● శాఖాపూర్ వద్ద ఎన్‌హెచ్–44పై
దుర్ఘటన
● యువకులు వనపర్తి జిల్లా వాసులే..

రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం