
పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎంపీఓలతో కలెక్టర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తూ.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, వాల్‌పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. నిబంధనల అమలుపై ప్రతిరోజు నివేదిక సమర్పించాలన్నారు. కలెక్టరేట్‌లో 24 గంటలు హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసి పౌర సరఫరాల సంస్థ డీఎంను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ఖర్చు నమోదు చేయాలని, నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం ఎన్నికలలో ప్రచార వ్యయం సమర్పించాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ పార్థసారధి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా పరిశ్రమలకు అనుమతులు
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వివిద శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. పరిశ్రమలకు టీజీ ఐపాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి నిర్దేశిత గడువులోగా జారీ చేయాలన్నారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద షెడ్యూల్ కులాలకు చెందిన వారికి 7, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వారికి 14 కలిపి మొత్తం 21 మందికి వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, ఎల్‌డీఓ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యవేక్షణ ఇంజినీర్ సాయిదివ్య, టీజీఐఐసీ జోనల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.