
శతశాతం కార్యక్రమంతో బలమైన పునాది
● రూ.3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణం
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది వేస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని, దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదువులు నిర్వహించారని తెలిపారు. రూ.3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణం కోసం జీఓ విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. మూడు అంతస్తుల ఈ గిరిజన భవన్‌లో విద్యార్థుల కోసం ఒక అంతస్తులో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏకాభిప్రాయం మేరకు
అభ్యర్థుల ఎంపిక
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని, మా జోక్యం ఉండదన్నారు. ప్రజల్లో ఆదరణ ఉందని, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామాల్లో, మండలస్థాయిలో కూర్చొని ఎవరిని నిలబెట్టుకోవాలో నిర్ణయించుకుంటారన్నారు. సమావేశంలో గిరిజన నాయకులు రఘునాయక్, లింగంనాయక్, శేఖర్ నాయక్, లక్ష్మణ్‌నాయ్, రాజునాయక్, తులసిరామ్ నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.