
ఈపీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉద్యోగులు, ఆయా సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈపీఎఫ్ (ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెన్షియల్ ఫండ్) సంస్థ ఆధ్వర్యంలో ‘నిధి ఆప్కే నిఖత్ 2.0 ’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉద్యోగుల కోసం కార్యక్రమాన్ని జేపీఎన్‌సీ కళాశాలలో ఈపీఎఫ్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 9 గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడికి అధికారులు సకాలంలో రాకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఈపీఎఫ్ అధికారులు ఒక్కో ఉద్యోగి సమస్యను అడిగి తెలుసుకుని, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ క్రమంలో పీఎఫ్ పెన్షన్ హయ్యర్ ఆప్షన్‌కు సంబంధించి ఆర్టీసీ కార్మికుల దరఖాస్తులు చిన్నపాటి కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అవగాహన శిబిరంలో అధికారులకు దరఖాస్తులు ఇచ్చిన వారిలో ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఉండటం గమనార్హం. హయ్యర్ పెన్షన్ డిమాండ్ లెటర్ రాని వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, ఒకసారి కార్మికులు వారి ఈపీఎఫ్ ఖాతా స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.