
జూరాలకు భారీగా వరద
● 5.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 39 క్రస్టు గేట్ల ఎత్తివేత
● 6 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 4.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 5.07 లక్షల క్యూసెక్కులకు పెరిగిందన్నారు. ఈ సీజనలో ఇంత పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో రావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టు గేట్లను ఎత్తి 5.20 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 22 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 5.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.569 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.052 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు 95,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రెండో రోజు నిలిచిన విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి 5.07 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆదివారం రెండో రోజు ఎగువ, దిగువ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 741.652 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
సుంకేసులకు మళ్లీ పెరిగిన వరద
రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద భారీగా పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాంలో నీటిమట్టం పెరుగుతుంది. ఆదివారం ఉదయం నాటికి 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 24 గేట్లను మీటర్ మేర ఎత్తి 1.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు కేసీ కెనాల్‌కు 2,012 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
రామన్‌పాడుకు కొనసాగుతున్న వరద
మదనాపురం: రామన్‌పాడు జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కోయిల్‌సాగర్, సరళాసాగర్ జలాశయాల ద్వారా వరద రావడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సరళాసాగర్ ప్రాజెక్టు ఒక ప్రైమరీ సైఫాన్, ఒక ఉడ్ సైఫాన్ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లింది. వరద ప్రభావంతో మదనాపురం వద్ద కాజ్వే మునిగింది.
మూడు గేట్లు ద్వారా నీటి విడుదల
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శనివారం వరద ఉధృతి భారీగా ఉండడంతో 7 గేట్లను తెరువగా ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో నాలుగు గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగులుగా ఉంది.

జూరాలకు భారీగా వరద