
కంటి వైద్య నిపుణుడి అదృశ్యం
● బాకీ తీర్చలేక 4 నెలల క్రితం స్నేహితుడి
ఆత్మహత్య.. జామీనుగా ఉన్నందుకు
అప్పులోళ్ల ఒత్తిడి
● 17 పేజీల ఆత్మహత్య లేఖ రాసి..సల్‌ఫోన్ వదిలి వెళ్లిన వైనం
● తల్లిదండ్రుల ఫిర్యాదు.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
మద్దూరు: అప్పు తీర్చలేక నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడు.. అతడికి జామీనుగా ఉన్న నేత్ర వైద్యుడిపై అప్పులోళ్ల తీవ్ర మైన ఒత్తిడి... దాన్ని తట్టుకోలేక 17 పేజీల సూసైడ్ నోట్ రాసి సెల్‌ఫోన్ ఇంటి దగ్గరే వదిలి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకపస్లావాద్ గ్రామ పరిధిలోని బోడమర్రిగడ్డతండాకు చెందిన పాత్లావత్ రమేష్‌నాయక్ పదేళ్ల నుంచి నారాయణపేట జిల్లా మద్దూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఐ–మిత్ర కంటి పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్దూరుకు చెందిన రక్త పరీక్షలు చేసే రామచంద్రయ్య మిత్రుడుగా మారాడు. అయితే రామచంద్రయ్య స్థానిక ఆర్‌ఎంపీ వద్ద అప్పు తీసుకునేటప్పుడు రమేష్‌నాయక్ జామీను ఇచ్చాడు. ఈ క్రమంలో అప్పు తీర్చలేకపోయిన రామచంద్రయ్య ఈ ఏడాది మే 23న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చాలని ఆర్‌ఎంపీ, అతని తమ్ముడు రమేష్‌నాయక్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్‌నాయక్ 17 పేజీల ఆత్మహత్య లేఖ రాసి సెల్‌ఫోన్ కంటి వైద్య కేంద్రంలోనే వదిలేసి మిత్రుడు చిన్నస్వామి బైక్‌పై వెళ్లి నారాయణపేట బస్టాండ్‌లో దిగాడు. తాను రాసిన ఆత్మహత్య లేఖను కొంతమంది సెల్‌ఫోన్‌లకు పంపించాడు. ఇది వైరల్‌గా మారి.. తల్లిదండ్రులకు తెలియడంతో మద్దూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమర్ కంటి పరీక్ష కేంద్రం చేరుకొని ఆత్మహత్య లేఖతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై రమేష్‌నాయక్ తండ్రి దామ్లానాయక్ ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. రమేష్‌నాయక్ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.