
పాలమూరులో ఎరువుల కొరత నివారించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో యూరియా కొరత నివారించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, పాలమూరు పునర్నిర్మాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే, జూన్ నెలల్లో విరివిగా భారీ వర్షాలు కురవడం వల్ల దాదాపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువ మోతాదులో వేశారని పేర్కొన్నారు. విస్తీర్ణంలో పెద్దదైన ఉమ్మడి మహబూబ్‌నగర్ కంటే ఇతర జిల్లాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలకు ఎక్కువ టన్నుల యూరియా వెళ్లిందన్నారు. ఉమ్మడి జిల్లా రైతుల కష్టాలను గుర్తించి వెంటనే ప్రత్యేకంగా యూరియా కేటాయించి అందించాలని వినతిలో కోరారు.
ఫుట్‌బాల్ పోటీలకు
వర్షం అడ్డంకి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు శుక్రవారం వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో మ్యాచ్‌లు నిర్వహించడానికి వీలులేకుండా పోయింది. పోటీలు జరిగే మెయిన్ స్టేడియం అంతా వర్షపు నీళ్లతో నిండి ఉండడంతో మ్యాచ్‌లు జరగలేదు. టోర్నీ మొదటి రోజు ఆరు మ్యాచ్‌లు నిర్వహించారు. నేడు(శనివారం) మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.