
ఏకధాటిగా వర్షం.. స్తంభించిన జనజీవనం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/ మున్సిపాలిటీ: అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలోకి వరద భారీగా చేరుకోవడంతో మత్తడి దూకాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి అంతకంతకూ వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు వద్ద 7 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలో ప్రధానమైన ఊకచెట్టు వాగు, పెద్దవాగు, దుందుభీ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఏకబిగిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో సగటున 37.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హన్వాడ మండలంలో 58.4 మి.మీ., అత్యల్పంగా అడ్డాకులలో 19.6 మి.మీ.., వర్షం కురిసింది.
జలదిగ్బంధంలో గాధిర్యాల్
జిల్లాలోని మహమ్మదాబాద్ మండలంలో భారీ వర్షానికి అన్ని చెరువులు, కుంటలు అలుగులు పారుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాధిర్యాల్ గ్రామం చుట్టూ మూడు వైపులా వాగులు ఉండటంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామం దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గండేడ్ మండలంలోని పెద్దవార్వాల్ గ్రామంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా నీరటి అంజయ్య ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్ గ్రామ శివారులో గల కానుగుల వాగు ఉధృతంగా పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రాణ, ఆస్తి నష్టం
జరగకుండా చూడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వివిధ శాఖల జిల్లా, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. రానున్న 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వలన ఎలాంటి సంఘటనలు జరిగినా ఎస్పీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు తగు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం 08542– 241165 ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌కు సంబంధించి ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 87124 72127, 87124 72128లకు సమాచారం అందించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగావిస్తారంగా వర్షాలు
పొంగిపొర్లిన వాగులు.. అలుగు పారిన చెరువులు
ఉధృతమైన వరదలతో
పలుచోట్ల నిలిచిన రాకపోకలు
రోజంతా ముసురుతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
జిల్లాలో మరో రెండురోజులపాటు భారీ వానలు

ఏకధాటిగా వర్షం.. స్తంభించిన జనజీవనం

ఏకధాటిగా వర్షం.. స్తంభించిన జనజీవనం