
నేటితరానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): చాకలి ఐలమ్మ నేటితరానికి స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ విజయేందిర అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువ, పోరాట పటిమను పరిచయం చేసిన చాకలి ఐలమ్మను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలు కొనసాగిస్తామని, భావితరాలకు ఆమె చరిత్రను అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని, ఆమె ఆదర్శాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, డీఎంహెచ్‌ఓ పద్మజ, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి పడకల ఆస్పత్రి పరిశీలన
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థానంలో నూతనంగా నిర్మించిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ విజయేందిర పరిశీలించారు. ఇంకా పూర్తి కావాల్సిన భవనాలు, పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. వెయ్యి పడకల బోధన ఆస్పత్రి భవనం ప్లాన్, నిర్మాణం ప్రగతిపై తెలంగాణ వైద్య, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఈఈ వేణుగోపాల్, ఏఈ శరత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాధాన్యత రంగాలకు రుణాలు
బ్యాంకర్లు ప్రాధాన్యత రంగాలకు వందశాతం రుణాలు అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మార్చి 2025–జూన్ 2025 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇతర బ్యాంకింగ్ సంబంధిత సమస్యలతో సహ వార్షిక క్రెడిట్ ప్లాన్ యొక్క వివిధ రంగాల కింద పథకం/ కార్యకలాపాల అమలులో జిల్లాలో సాధించిన పురోగతిని సమీక్షించి సూచనలు చేశారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ రుణాలు మంజూరు చేయాలని, పీఎంఈజీపీ దరఖాస్తులను సాధారణ కారణాలతో తిరస్కరించకూడదని, పీడబ్ల్యూడీలకు ర్యాంప్ సౌకర్యాన్ని బ్యాంకు అందించాలన్నారు.