
ఎస్‌హెచ్‌జీలకు డ్రెస్ కోడ్
● ఒకే తరహాలో చీరల పంపిణీకి చర్యలు
● రేవంతన్న కానుక పేరిట త్వరలో అందజేత
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తల మాదిరిగానే ఇక నుంచి స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు కూడా ప్రభుత్వం కొత్తగా డ్రస్ కోడ్‌ను తెచ్చింది. సంఘం సభ్యుల సమావేశాలు, అధికార కార్యక్రమాల్లో పాల్గొంటే ఇట్టే గుర్తు పట్టేందుకు ప్రభుత్వం రేవంత్ అన్న పేరుతో ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ బతుకమ్మ పండుగకు గాను అందజేసేందుకు శ్రీకారం చుట్టంది. ఇప్పటికే సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల వివరాలను అధికారులు సేకరించారు. కాగా.. జిల్లాకు ఇప్పటికే 1,00,800 చీరలు జిల్లాకు వచ్చాయి.
ఒక్కొక్కరికి రెండు చొప్పున..
గత ప్రభుత్వం రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు డీలర్ల ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే ఈ చీరలు నాణ్యతగా లేవని, మహిళలు వీటిని ధరించడం లేదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బతుకమ్మ పండుగకు చీరల పంపిణీని నిలిపివేిసిన విషయం తెలిసిందే. అయితే కొంత వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు అందించి దానిని పోగొట్టుకోవాలని చూస్తుంది. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మొదటి విడతగా ఒక్కో చీర మాత్రమే ఇవ్వనున్నారు. దీనికోసం మొదటి విడత ఇటీవల జిల్లాకు 1,00,800 చీరలు రాగా.. వీటిని బండమీదిపల్లిలోని జిల్లా మహిళ సమాఖ్య భవనంలో భద్రపరిచారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయికి తరలించనున్నారు. అయితే ఈ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడానికి అధికారులు జంకుతున్నారు.
త్వరలోనే పంపిణీ చేస్తాం..
ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి సంఘంలోని సభ్యురాలికి ఒక చీరను ఉచితంగా ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి చీరలు సైతం ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. త్వరలోనే వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– నర్సింహులు, డీఆర్‌డీఓ