
పింఛన్‌దారులను మోసం చేసిన రేవంత్ సర్కార్
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
దేవరకద్ర/మక్తల్: రాష్ట్రంలోని పింఛన్‌దారులను రేవంత్‌రెడ్డి సర్కారు దారుణంగా మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురువారం దేవరకద్ర, మక్తల్ పట్టణాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పింఛన్‌దారుల సన్నాహక సదస్సులకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 45లక్షల మంది పింఛన్ దారులు ఉండగా.. వికలాంగులకు రూ. 6వేలు, వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధుల పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని, 10లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 22 నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపు మాట ఎత్తడం లేదన్నారు. వికలాంగులు, వృద్ధుల పింఛన్ పెంపు విషయాన్ని ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ఎస్సీ వర్గీకరణ సాధించామని.. అదే విధంగా పింఛన్ల విషయంలో కూడా ఉద్యమించి సాధించి తీరుతామన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 6 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయిలో రీలే దీక్షలు చేపట్టాలని మందకృష్ణ సూచించారు. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 26న హైదరాబాద్‌లో పింఛన్‌దారులతో మహా గర్జనను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నరేందర్, జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింహం, నాయకులు భిక్షపతి, శివకుమార్, బాలరాజు, వెంకటేశ్, శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, నాగేశ్, జ్ఞానప్రకాశ్, అంజప్ప తదితరులు పాల్గొన్నారు.