
ఆకతాయిలపై ప్రత్యేక నజర్
గద్వాల క్రైం: అల్లర్లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆకతాయిలపై పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. గతంలో కేసులు నమోదై పోలీసు రికార్డులో ఉన్న రౌడీలను అదుపులోకి తీసుకుని బెండు తీసే పనిలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసుశాఖ నిమగ్నమైంది. మద్యం మత్తు, అకారణంగా ఇతరులపై దాడులకు తెగబడుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిస్తున్న తాజా ఘటనలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల–అలంపూర్ సెగ్మెంట్‌లో గడచిన 15 రోజుల వ్యవధిలో 10మంది ఆకతాయిలు అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. పరారీలో ఉన్న మరి కొంతమంది ఆకతాయిల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం త్వరలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దు ప్రాంతం కావడంతో..
జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోవడంతో అల్లర్లు, హింసత్మక దాడులకు పాల్పడే నిందితులు తప్పించుకునేందుకు సులువుగా ఉంటుంది. మరోవైపు జిల్లాకు రైలు, రోడ్డు మార్గం ఉండడంతో ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో బాధితులు తమపై జరిగిన దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నా రు. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమై నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అయితే కేసుల్లోంచి తప్పించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిషేధిత మత్తు పదార్థాల కట్టడి
జిల్లా పరిధిలో నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు కలవర పెడుతున్నాయి. ఇటీవల గట్టు మండలంలోని బోయలగూడెం శివారులో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు చేస్తున్న వారిలో యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం ధరలు అధికంగా ఉండడంతో కి క్కు కోసం యువత తక్కువ ధరకు దొరికే గంజాయికి బానిసలవుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాల నిషేధానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు. పోలీసులు గంజాయి విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వారి వివరాలను తెలుసుకోగా ఎక్కువ సంఖ్యలో యువతే ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ అందించారు. గంజా యి విక్రయించిన వారిని రిమాండ్‌కు తరలించారు.
తలనొప్పిగా మారిన నేతల ఒత్తిళ్లు
జిల్లాలో 20 రోజల క్రితం జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో నిందితులు తమ వర్గానికి చెందిన వారు వదిలేయండి అంటూ.. ఓ వైపు మంత్రి, ఎంపీల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు మౌనం పాటించాల్సి వచ్చింది. అయితే స్థానికంగా బలమైన నాయకుడు నిందితులను శిక్షించాలని కోరడంతో పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపట్టారు. ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కేసుల నమోదు.. రిమాండ్‌కు తరలింపు
– పరారీలో పలువురు నిందితులు
– ముమ్మరంగా గాలింపు
– స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పటిష్ట చర్యలు