
చేపల ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన
వనపర్తి: జిల్లాలో అంతర్జాతీయ మత్స్య రవాణా, ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ఆదర్శ్‌సురభి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలోని వై.శాఖాపురం గ్రామ శివారులోని సర్వే నంబరు 163, 162, 143లో గల పది ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని తహసీల్దార్ మురళితో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకు ఏర్పాటు కోసం పెబ్బేరు మండలం తోమాలపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 104లో ఖాళీగా ఉన్న 30 గుంటల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీలో మల్లికార్జున ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణానికి ఇప్పటి వరకు సరఫరా అయిన యూరియా, పంపిణీ చేసిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను పారదర్శకంగా అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్‌లో ఎరువుల అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.