
జీపీఓలు వచ్చేశారు
● 191 మందికి గాను
145 మందికి ఆర్డర్లు జారీ
● రెవెన్యూ శాఖలో తగ్గనున్న పని ఒత్తిడి
● భూ భారతి అమలులో కీలక ముందడుగు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: చట్టం, నియమాలు, వ్యవస్థ, పోర్టల్ అనే నాలుగు మూలస్తంభాల ద్వారానే రెవెన్యూ శాఖ ముందడుగు సాధిస్తుందనే ప్రభుత్వ ఆలోచనతో ఒక్కొక్కటిగా ఆచరణకు నోచుకుంటోంది. వ్యవస్థలో ఓ స్తంభంగా గ్రామ పాలన అధికారుల పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ క్రమంలో జీపీఓల నియామకంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆశించిన పురోగతి సాకారం కానుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భూ భారతి అమలులో జీపీఓల నియామకంతో మరో కీలక ముందడుగు వేసింది. రెవెన్యూ సదస్సులు, ప్రజావాణితోపాటు రోజువారిగా పలు అంశాలపై వస్తున్న ఫిర్యాదులకు వేగవంతంగా పరిష్కారం చూపేందుకు మార్గం సుగమమైంది. గ్రామాల్లో పాలన అధికారుల ద్వారా రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి పని ఒత్తిడి తగ్గించడంతోపాటు ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. విచారణ మొదలుకొని రెవెన్యూ పరమైన అంశాల్లో పారదర్శకతతోపాటు సమస్యలకు శాశ్వత పరిష్కారం క్షేత్రస్థాయిలోనే చూపాలన్నది ప్రభుత్వ ఆలోచన. పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా జీపీఓల నియామకంతో చర్యలు చేపడుతోంది. గతంలో రెవెన్యూ శాఖలో గ్రామాల్లో పనిచేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తొలగించి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి నెలకొంది. దీన్ని మళ్లీ ప్రక్షాళణ చేస్తామన్న హామీలో భాగంగా వారిని వెనక్కి తీసుకొచ్చి జీపీఓలుగా నియమించింది. జీపీఓల నియామకంలో భాగంగా ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు ఆప్షన్లు ఇచ్చి ఎంపిక చేసింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన వారికి జీపీఓలుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 191 క్లస్టర్లు
జిల్లాలో మొత్తం 316 రెవెన్యూ గ్రామాలుండగా అందులో ప్రభుత్వం 191 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్టస్టర్‌లోని రెండు, మూడు గ్రామాలకు ఒక జీపీఓను నియమించింది. ఈ మేరకు జిల్లాకు కేటాయించిన 191 మంది జీపీఓలలో ఇప్పటి వరకు 145 మందికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న 145 మందిలో 135 మంది జీపీఓలు ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిపోర్టు చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తూ గతంలో వీఆర్‌ఏలుగా పనిచేసిన మరో 54 మందిని జీపీఓలుగా నియమించనున్నారని తెలిసింది. ఇతర జిల్లాలలో కౌన్సెలింగ్ ద్వారా గతంలో పనిచేసిన వీఆర్‌ఏలను జీపీఓలుగా నియమించినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
గతంలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారికి ఆప్షన్‌లు ఇస్తూ జీపీఓల నియామకానికి దరఖాస్తులు స్వీకరించింది. వారందరికీ పరీక్షలు సైతం నిర్వహించడం జరిగింది. ఇందులో అర్హులైన వారిని జీపీఓలుగా నియమిస్తూ జిల్లాకు 191 మందిని కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ 145 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేయగా.. అందులో 135 మంది ఆయా మండలాల్లో రిపోర్టు చేశారు.
– సువర్ణరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి