
నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
జడ్చర్ల: ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌కు అనుగుణంగానే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం ఆమె మండలంలోని మల్లెబోయిన్‌పల్లి, మాచారం గ్రామాల్లో ఆకస్మికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు సూచించిన కొలతల ప్రకారమే ఇళ్లు నిర్మించకోవాలన్నారు. అలాగే వ్యయప్రయాసాల కోర్చి ఇబ్బందులు పడి.. అప్పుల పాలు కావొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వమే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని, ఇంటి నిర్మాణం దశల వారిగా బిల్లులు చెల్లిస్తామని వివరించారు. అయితే బేస్‌మెంట్ పనులు పూర్తయినా తమకు బిల్లు రాలేదని లబ్ధిదారు అంజమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారి, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తమకు రెండు బిల్లులు మాత్రమే వచ్చాయని స్లాబ్ నిర్మాణం పూర్తి చేసినా మూడో బిల్లు ఇప్పటి వరకు రాలేదని మరొకరు కలెక్టర్‌కు చెప్పారు. ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. ఎన్ని ప్రగతిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో రేక్ పాయింట్‌కు వచ్చిన యూరియాను పరిశీలించారు.జిల్లాకు తాజాగా 529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. యూరియాను రైతులకు అందుబాటులో అన్ని మండలాలకు పంపుతున్నట్లు చెప్పారు. మంగళవారం 786 మె.ట., యూరియా రాగా.. అన్ని మండలాలకు సరఫరా చేశామన్నారు. మరో ఐదు రోజుల్లో 1,500 మె.ట., వస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, డీఏఓ వెంకటేశ్ తదితరులున్నారు.