
వైద్యులు అందుబాటులో ఉండాలి
దేవరకద్ర: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. బుధవారం మండలంలోని గూరకొండలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడం వల్ల ప్రజలు వైరల్ ఫీవర్, ఇంకా ఇతర అంటువ్యాధులతో బాధపడుతున్నారని వారికి సరైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రతిరోజు అందుబాటులో ఉండాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి వ్యాధులు సోకిన వారిని గుర్తించి మందులు పంపిణీ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులను ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో, నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం దేవరకద్ర మహిళా సమాఖ్యకు మంజూరైన పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడానికి అదనపు కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. మండల పరిషత్ కార్యాలయం ముందున్న పాత క్వార్టర్ స్థలాన్ని పరిశీలించి అనువుగా లేదని తేల్చారు. జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక పాల్గొన్నారు.