
చంద్రఘంటాదేవి.. పాహిమాం
● వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
● ప్రముఖులు, దాతల ప్రత్యేక పూజలు
అలంపూర్: చంద్రఘంట మాతా.. పాహిమాం అంటూ భక్తులు అమ్మవారిని శరణు కోరారు. అలంపూ ర్ క్షేత్రంలో శరన్న నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. ఉత్సవాల మూడో రోజు బుధవారం జోగుళాంబ మాత చంద్రఘంట దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేశారు. చంద్రఘంట మాతను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చగా.. అర్చక స్వాములు కొలువుపూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసిని పూజ, మహామంగళహారతి, నీరజన మంత్ర పుష్పములు వంటి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి ని రంతరాయంగా నిత్యానుష్ఠానం, అవాహిత దేవతా హోమాలు, కుంకుమార్చనలు, శ్రీచక్రనవావరణ అర్చనలు, సహస్రనామర్చన దశవిధ హారతులను అందజేశారు. శరన్నవరాత్రుల్లో జోగుళాంబను మూడోరోజు చంద్రఘంట మాతగా ఆరాధిస్తారని అర్చకస్వామలు తెలిపారు. అమ్మవారు శిరస్సుపై అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడంతో చంద్రఘంట దేవీగా పేరుగాంచినట్లు భక్తులకు వివరించారు. అమ్మవారు చేతుల్లో శస్త్ర, అస్త్రాలను ధరించి ఉంటారని, చంద్రఘంట అమ్మవారిని ఆరాధించిన వారికి మంగళం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రానికి తరలి వచ్చిన భక్తులకు ప్రసాద్ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందజేశారు. ఉత్సవాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శంకర్ ఎస్‌ఐ వెంకటస్వామితో కలిసి పరిశీలించారు.
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎంపీ డీకే అరుణ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఈఓ దీప్తి అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో ఎంపీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర, దేశ ప్రజలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. శక్తిపీఠ క్షేత్ర అభివృద్ధికి కేంద్రం ద్వారా గతంలోనే నిధులు వచ్చాయన్నారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు కావడానికి అవకాశం ఉంటుందన్నారు. దేవదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో ఉమ్మడి ప్రతిపాదనలు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో అన్ని పనులకు కలిపి నిధులు మంజూరయ్యాయని, పెండింగ్‌కు పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలన్నారు. నిధుల మంజూరుపై సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు.
ఎంపీకి వినతులు
అలంపూర్ క్షేత్ర ఆలయాలను దర్శించుకున్న మహబుబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు పలువురు వినతులు అందజేశారు. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ రైల్వే స్టేషన్‌లో అన్ని రైళ్లు నిలిపేలని పాలక మండలి సభ్యులు వినతి పత్రం అందజేశారు. రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఒక రైలుకు జోగుళాంబ ఎక్స్‌ప్రెస్ పేరుగా నామకరణ చేయాలని కోరారు. అలంపూర్ క్షేత్రానికి దర్శనానికి వచ్చే క్రమంలో పలువురు నాయకులు డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. నాయకులు శరత్‌బాబు, రంగస్వామి, నరేశ్, లక్ష్మణ్, మద్దిలేటి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
అమ్మవారికి మకరతోరణం
అలంపూర్: జోగుళాంబ అమ్మవారికి భక్తులు మకరతోరణం బహూకరించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు తీగల క్రాంతిరెడ్డి, లక్ష్మీస్రవంతి అమ్మవారికి బంగారం పూతతో మకరతోరణం పీఠం తొడుగులను బహూకరించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదపు రూ.55లక్షల వరకు ఉంటుందన్నారు. తీగల క్రాంతిరెడ్డి, లక్ష్మీస్రవంతికి ఈఓ స్వాగతం పలికి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు తీర్థప్రసాదాలను అందజే ఆశీర్వచనం పలికారు.

చంద్రఘంటాదేవి.. పాహిమాం