
అక్టోబర్ 22 నుంచి కురుమూర్తి జాతర
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వచ్చేనెల 22 నుంచి నవంబర్ 7 వరకు నిర్వహించనున్న కురుమూర్తిస్వామి (జాతర) బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కురుమూర్తిస్వామి జాతర ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి.. జాతర వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 22న ప్రారంభమవుతాయని, 26న స్వామివారి అలంకారోత్సవం, 28న ఉద్దాల ఉత్సవం, నవంబర్ 2న స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఆహారం, ఫెస్టివల్, లా అండ్ ఆర్డర్ తదితర ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, పారిశుధ్యం, టాయిలెట్లు, బందోబస్తు, రవాణా సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
● బందోబస్తులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ తరపున ప్రథమ చికిత్స, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు.
● ఆర్‌అండ్‌బీ ద్వారా బారికేడింగ్, రహదారులకు ప్యాచ్ వర్కు, మరమ్మతు చేయించాలని ఆదేశించారు. పీఆర్ పరిధిలోని రోడ్లపై గుంతలు పూడ్చాలని, రోడ్డు పొడవునా జంగిల్ కటింగ్ చేయాలన్నారు.
● మిషన్ భగీరథ శాఖ ద్వారా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, షవర్లు పెట్టాలని, భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ముఖ్యమైన రోజులలో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేపట్టాలన్నారు.
● 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
● ఎకై ్సజ్ శాఖ ద్వారా అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులను మూసివేయడమే కాకుండా, మద్యం అమ్మకాలు లేకుండా చూసుకోవాలన్నారు.
● భక్తులకు అన్ని విషయాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులు నడిపించాలని, పంచాయతీ శాఖ ద్వారా శానిటేషన్‌కు ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సమస్య రాకుండా చూసుకోవాలన్నారు.
● బ్రహ్మోత్సవాలపై జిల్లాలోని ప్రజలతోపాటు ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని డీపీఆర్‌ఓను ఆదేశించారు.
● ఎస్పీ జానకి మాట్లాడుతూ జాతరలో బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయం పోలీస్ శాఖ ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. షీ టీం, మఫ్టీ టీంలను ఏర్పాటు చేసి చోరీలు, ఇతరత్రా అవాంచనీయ ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాటు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
కలగకుండా చర్యలు
కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో
కలెక్టర్ విజయేందిర ఆదేశం
విజయవంతం చేద్దాం..
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవరకద్ర నుంచి కురుమూర్తి ఆలయానికి వచ్చే దారిలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద రెండు చోట్ల డైవర్షన్ చేసిన సర్వీస్ రోడ్లకు మరమ్మతు చేపట్టాలని సూచించారు. సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, కురుమూర్తిస్వామి ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదన్‌రెడ్డి, జిల్లా, చిన్నచింతకుంట మండల అధికారులు పాల్గొన్నారు.