రాజాపూర్ (బాలానగర్)/ అడ్డాకుల/ భూత్పూర్: సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు భద్రత, నమ్మకం కల్పించాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. బుధవారం బాలానగర్, మూసాపేట మండల కేంద్రాల్లో పోలీస్‌స్టేషన్లను ఆయన ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందుతూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. అలాగే భూత్పూర్ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, కేసుల దర్యాప్తు తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. విలేజ్ పోలీసు ఆఫీసర్లు వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని, తక్షణమే స్పందించాలని డీఐజీ సూచించారు. వారి వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జునగౌడ్, రామకృష్ణ, ఎస్‌ఐలు లెనిన్‌గౌడ్, శివకుమార్‌నాయుడు, శివానందంగౌడ్, వేణు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.