
ఖైదీలకు మెరుగైన సేవలు అందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి న్యాయసేవాధికార సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామన్నారు. వంటశాల, ఆహార పదార్థాలు, వంట సరుకులను పరిశీలించారు. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలర్ గుణశేఖర నాయుడు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు.