
మాజీ కౌన్సిలర్‌పై కేసు నమోదు
● నగర కమిషనర్‌పై అసభ్య పదజాలం
● ఆడియో వాట్సాప్‌లో హల్‌చల్
● ఉన్నతాధికారులకు
ఫిర్యాదు చేసిన కమిషనర్
మహబూబ్‌నగర్ క్రైం/మున్సిపాలిటీ: మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో మాజీ కౌన్సిలర్‌పై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పలు రకాల సెక్షన్స్ కింద కేసు నమోదైనట్లు వన్‌టౌన్ సీఐ అప్పయ్య పేర్కొన్నారు. సీఐ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 7వ వార్డు శ్రీనివాసకాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ నగర కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కార్యాలయం వద్దకు వచ్చి తన విధులకు అటకం కల్గించేలా ప్రవర్తించాడని కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారి విధులకు అటంకం కలిగించిన క్రమంలో సెక్షన్ 221, 132, 133, 352 బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
● ఉన్నత అధికారులకు ఫిర్యాదులు
మహబూబ్‌నగర్ నగర కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం శ్రీనివాసకాలనీలో ఆయన అద్దెకు ఉన్న ఇంట్లో ఉండగా.. మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి పలుమార్లు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేసిన వెంటనే వ్యక్తిగతంగా దూషించారు. ఆ తర్వాత కమిషనర్ ఆఫీస్ వద్దకు వెళ్లాగా.. అప్పటికే అక్కడ ఉన్న రవికిషన్‌రెడ్డి గేట్ దగ్గర ఎదురుపడ్డారు. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతోపాటు హైడ్రామా కొనసాగింది. అప్పటికే వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్యతోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని కట్టా రవికిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై కమిషనర్ ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్‌కు శివేంద్రప్రతాప్‌కు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లుకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.