
కొండారెడ్డిపల్లిని అగ్రస్థానంలో నిలుపుదాం
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. మంగళవారం కొండారెడ్డిపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరు పత్రాలతో పాటు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26న మెగా జాబ్‌మేళా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. కొండారెడ్డిపల్లి నుంచి కంపెనీ వరకు బస్సు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. దేశంలోని ఏ గ్రామంలో జరగని అభివృద్ధి కొండారెడ్డిపల్లిలో జరుగుతుందని.. ఇప్పటికే దాదాపు రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తిచేయడం జరిగిందన్నారు. కొండారెడ్డిపల్లి నుంచి డిండిచింతపల్లి వరకు ఫోర్‌లైన్స్ నిర్మాణానికి దాదాపు రూ. 56కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో పాఠశాల భవనం, పాలసేకరణ కేంద్రం, పోస్టాఫీస్ నిర్మాణాలతో పాటు శ్రీశైలం హైవేలోని రాంనగర్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 34కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఈ నెల 29న రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని.. ఇంకా ఏ అవసరాలు ఉన్నా తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో కృష్ణారెడ్డి, వేమారెడ్డి, రాఘవేందర్, సురేందర్‌రెడ్డి, మల్లయ్య తదితరులు ఉన్నారు.