
రైల్వే బ్రిడ్జిలు నిర్మించండి
కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యే వినతి
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్నకు వినతిపత్రం అందించారు. పాలమూరులో రైల్వే గేట్ల వల్ల నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తున్న క్రమంలో రైల్వే గేట్లు సమస్యగా మారాయని.. సరైన రోడ్డు విభజన లేకపోవడం వల్ల గేట్ పడిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే టీడీగుట్ట, బోయపల్లి గేట్, తిమ్మసానిపల్లి రైల్వేగేట్ల వద్ద కేంద్రం నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అదే విధంగా సద్దలగుండు, దివిటిపల్లిలో పాదాచారుల కోసం ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.