
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మన్ననూర్: ఐటీడీఏ పరిధి, నల్లమల పరీవాహక ప్రాంతంలోని చెంచుపెంటలు, గూడేల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మన్ననూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ సమావేశం హాలులో సంబంధిత వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్, పదర, అచ్చంపేట, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ అనుసంధానంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పీఎం జన్‌మన్, మొబైల్ టీం, ఎంసీహెచ్ అపిడెమిక్ టీం అధికారులు, సిబ్బందితో చర్చించారు. సీజనల్ వ్యాధులు, టీబీ, గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసున్నారు. ముఖ్యంగా మారుమూల చెంచు పెంటల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎండీహెచ్‌ఓ రవికుమార్, ఎంహెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, పీఎం జన్‌మన్ జిల్లా ఇన్‌చార్జ్ కృష్ణమోహన్, మాతా శిశు సంక్షేమం, ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కె అధికారులు, పీహెచ్‌సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.