
గత పాలకుల నిర్లక్ష్యంతోనే అసంపూర్తిగా ‘పాలమూరు’
● మెయిన్ కెనాల్‌ను గాలికొదిలేశారు..
● వచ్చే జూన్ నాటికి కర్వెన పనులుపూర్తి చేస్తాం
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
భూత్పూర్: గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగా మిగిలాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కర్వెన రిజర్వాయర్ వద్ద ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఎస్‌ఈ జగన్మోహన్ శర్మ, ఈఈ దయానంద్, డీఈఈలు విజయేందర్, ప్రభాకర్‌రెడ్డి, అబ్బు సిద్ధిఖీలతో కలిసి పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 2015 జూన్‌లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసిన కేసీఆర్.. మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారన్నారు. అయితే పాలమూరు పనులను నిర్లక్ష్యంచేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ. 29,600 కోట్లు ఖర్చు చేశారే తప్ప ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని.. మెయిన్ కెనాల్‌ను గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. 13, 14,15 ప్యాకేజీల పనులు పూర్తి కావడానికి రూ. 450 కోట్లు అవసరం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించాలని ఎమ్మెల్యే చెప్పారు. మెయిన్ కెనాల్‌కు అప్పట్లోనే భూ సేకరణ చేసి ఉంటే వ్యయం పెరిగేది కాదని.. భూ సేకరణ సమస్య కూడా ఉత్పన్నమయ్యేది కాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి కావాలంటే రూ. 12వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నివేదిక ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, ప్రధాన కాల్వకు భూ సేకరణ పూర్తిచేయడంతో పాటు వచ్చే జూన్ నాటికి కర్వెన పనులు పూర్తిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్, నాయకులు అరవింద్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.