
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి: డీఐజీ
నర్వ/మక్తల్/మాగనూర్: పోలీసు సిబ్బంది గ్రామాల్లో ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన నర్వ, మక్తల్, మాగనూర్ పోలీస్‌స్టేషన్లను ఆయన సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారం, క్రైమ్ ప్రివెన్షన్ చర్యలపై పలు సూచనలు చేశారు. సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకొని సమయపాలన పాటించాలని సూచించారు. డయల్ 100 సేవలపై వేగవంతంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీపీఓలు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు సేవలు అందించాలని.. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులతో కలిసి భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలనీలు, గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, దొంగతనాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.