
కోయిల్‌సాగర్ 6 గేట్ల ద్వారా నీటివిడుదల
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు భారీగా వరద జలాలు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండడంతో సోమవారం 6గేట్లను రెండు అడుగుల మేర తెరిచి 4200 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. కోస్గి, కొడంగల్, దౌల్తాబాద్, పరిగి తదితర ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలకు పెద్దవాగు ప్రవహం ఉరకలు వేస్తున్నది. శనివారం మూడు గేట్లను తెరువగా ఆదివారం ఒకగేటును తెరిచి నీటిని వదిలారు. సోమవారం ఏకంగా 6గేట్లను తెరవడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. ఆగస్టు నుంచి వరద ప్రవాహం పెరిగినప్పుడల్లా తరచూ గేట్లను తెరిచి నీటిని వదులుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పెద్దవాగు ప్రవాహం పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. అప్రమత్తమైన అధికారులు ఆరుగేట్లను తెరిచారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు.
బండర్‌పల్లి వద్ద ఉరకలు వేస్తున్న చెక్‌డ్యామ్
కోయిల్‌సాగర్ 6గేట్లను తెరవడంతో దిగువ ప్రాంతంలోకి వాగు ఉరకలు వేస్తున్నది. బండర్‌పల్లి వద్ద పాత వంతెనపై నిర్మించిన చెక్‌డ్యామ్ ఉప్పొంగుతున్నది. కొత్త వంతెన కింద నుంచి భారీగా వాగు ప్రవాహం రావడంతో పలువురు వాహనదారులు వాహనాలను నిలిపి నీటి ప్రవాహాన్ని చూస్తూ కనిపించారు.