
ఉత్సవాలకు అంకురార్పణ
● అలంపూర్‌లో అట్టహాసంగా
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
● వేదమంత్రాలతో మార్మోగిన ఆలయాలు
● భారీగా తరలి వచ్చిన భక్తులు
అమ్మవారి అలంకరణ
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలకు సోమవారం అంకుర్పారణ చేశారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభించారు. సంప్రదాయానికి స్వాగతం పలుకతూ ఈఓ దీప్తి, పాలక మండలి సభ్యులు అర్చక స్వాములతో కలిసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారి ఆలయం అర్చక స్వాములు ఈఓతో కలిసి మంగళవాయిద్యాలు, పట్టువస్త్రాలతో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారి అనతీ స్వీకరణ పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ బలిభేరీ తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం తరఫున పట్టువస్త్రాలు, మంగళ ద్రవ్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రదక్షిణ, ప్రవేశం, మహా గణపతిపూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణ, రక్షాబంధనం, మహా కలశస్థాపన, అగ్నిముఖం చేశారు. యాగశాలలో చండీహోమం, సహాస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నవాన్న సహిత మహానివేదన, బలిహరణ సమర్పణ కార్యక్రమాలు కొనసాగాయి. మృతసంగ్రహణంలో భాగంగా స్వామి వారి ఉద్యానవనంలో పట్టుమట్టికి పూజలు చేశారు. అనంతరం మహిళలు పుట్టమట్టిని మంగళవాయిద్యాల మధ్య యాగశాలకు చేర్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జగన్‌మోహన్ నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, అడ్డాకుల వెంకటేశ్వర్లు, పులేందర్, సురేందర్ స్వామి, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు, ఎక్‌అఫిషీయో సభ్యులు ఆనంద్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దేవతలకు ఆవాహనం పలుకుతూ..
దేవీశరన్న నవరాత్రిని పురస్కరించుకొని ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు ప్రతీకగా ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణం చేశారు. శక్తిని ప్రేరేపించేందుకు దేవతలకు ఆవాహనం పలుకుతూ ఉత్సవానికి గుర్తుగా ధ్వజాన్ని ఆరోహణ చేస్తారని అర్చక స్వాములు తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు హాజరై అర్చకస్వాములతో కలిసి ధ్వజారోహణం చేశారు. అంతకుముందు ఈఓ దీప్తి అర్చకులతో కలిసి స్వాగతం పలికారు.
శైలపుత్రిగా జోగుళాంబ దేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంలో శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారు సోమవారం శైలపుత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకున్నారు. మొదటిరోజు సువాసినీ, కుమారి పూజలు చేశారు.

ఉత్సవాలకు అంకురార్పణ

ఉత్సవాలకు అంకురార్పణ

ఉత్సవాలకు అంకురార్పణ