
పింఛన్లు పెంచేవరకు పోరాటం చేస్తాం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు
మందకృష్ణ మాదిగ
కొల్లాపూర్: సామాజిక పింఛన్లు పెంచే వరకు రేవంత్ సర్కారుపై పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ వెల్లడించారు. దివ్యాంగులు, చేయూత పింఛనుదారులతో సోమవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మందకృష్ణ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పింఛన్ల పెంపు కూడా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4వేలకు పెంచుతామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 22నెలలు కావస్తున్నా.. ఎందుకు పింఛన్లు పెంచడంలేదని ప్రశ్నించారు. పింఛనుదారులను రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 45లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారని, వారందరికీ పెంచాలని, కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 10లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన తాను రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నానని వివరించారు. పింఛన్లు పెంచేవరకు రేవంత్ సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు మందకృష్ణను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్‌చారి, బాలకృష్ణ, సంగెం, మద్దిలేటి, కుర్మయ్య, రాములు, చందన్‌గౌడ్, పరమేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.