
ప్రియురాలి వేధింపులతో యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: ఇరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎవరికి వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత కూడా ప్రియుడితోనే ఉండేందుకు నిశ్చయించుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువకుడు సూసైడ్ నోట్ రాసుకొని తనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భీమన్నగౌడ్, రాజమ్మలకు అనికుమార్‌గౌడ్, సునీల్‌కుమార్‌గౌడ్, ధనుంజయ్‌గౌడ్, జయలక్ష్మీలు సంతానం. ధనుంజయ్‌గౌడ్(27) పెళ్లి కాక ముందు నుంచే గ్రామానికి చెందిన, వయస్సులో తనకన్నా పెద్దదైన శశికళను ప్రేమించాడు. కులాలు వేరుకావటం, వయసులో పెద్దది కావటంతో పెద్దలు, తల్లిదండ్రులు ఇద్దరికీ సర్దిచెప్పడంతో దూరంగా ఉంటున్నారు. శశికళను మంత్రాలయంకు చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. ధనుంజయ్‌గౌడ్(27) ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎర్రకోటలోని తన మేనమామ కృష్ణగౌడ్ కుమార్తె సాయిప్రియతో 2022 జూన్‌లో వివాహమైంది. అయితే శిశకళకు పెళ్లై పిల్లలున్నా ధనుంజయ్‌గౌడ్‌తో తిరిగి స్నేహం కొనసాగించింది. ఇరువురూ ఊరు వదలి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలుచుకొచ్చి సర్దిచెప్పారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇరువురూ పారిపోవడంతో ధనుంజయ్‌గౌడ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కేసు కోర్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ భర్త, ఇద్దరు ప్లిలలను వదలి ధనుంజయ్‌గౌడ్ వద్దకు చేరుకుంది. చేసేది లేక కర్నూలు రోడ్డులోని ఓ లేడిస్ హాస్ట్టల్‌లో శశికళ ను ఉంచి తాను ఎమ్మిగనూరులోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే శిశకళ తనను పెళ్లి చేసుకొవాలని, ఎన్ని రోజులు హాస్టల్లో పెడతావంటూ వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం గువ్వలదొడ్డికి వెళ్లిన ధనుంజయ్‌గౌడ్‌కు హాస్టల్లో ఉన్న శశికళ వీడియోకాల్ చేసి నన్ను తీసుకెళ్లకపోతే ఉరేసుకొని చనిపోతానంటూ బెదిరించింది. ఆమె చనిపోతే కేసు తన మీదకే వస్తుందని భయాందోళనకు లోనైన ధనుంజయగౌడ్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు.
శశికళను భర్త, పిల్లల దగ్గరకు చేర్చండి
ధనుంజయ్‌గౌడ్ తన సుసైడ్ నోట్‌లో ‘‘నేను చనిపోతున్నా.. శశికళను తన భర్త, పిల్లల దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకోండి’’ అని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులును కోరాడు. ‘‘శశికళ భర్త చాలా మంచివాడు, శశికళ చనిపోతానని నన్ను భయపెట్టినందుకే నేను తప్పు చేశాను. నా చావే అన్నింటికీ పరిష్కారం.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి. మేన మామకు వేరీ వేరీ సారీ. చెల్లెలు బుజ్జమ్మను కలెక్టర్‌గా చూడాలనుకున్నా.. ప్రియురాలి కోసం అందరనీ దూరం చేసుకున్నా. ఇక సెలవు..’’ అనే సమాచారంతో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసుకుని తనువు చాలించాడు.
సుసైడ్ నోట్
ధనుంజయ్‌గౌడ్ (ఫైల్)

ప్రియురాలి వేధింపులతో యువకుడి ఆత్మహత్య