
గ్యాస్ లీకై ఇంట్లో భారీ పేలుడు
● భార్యాభర్తలకు, ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు
వెల్దుర్తి: గ్యాస్ లీకై మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించి ఇల్లు ధ్వంసం కావడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన వెల్దుర్తి మండలం బోయనపల్లె గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో చోటుచేసుకుంది. గాయపడిన వారిలో వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణ (6 నెలల గర్భిణి), వారి కుమారులు అనిల్, చరణ్ ఉన్నారు. వడ్డె నాగరాజు గౌండ పనిచేస్తూ గ్రామంలో చర్చి వద్ద ఉన్న ఇంట్లో బాడుగకు నివాసముంటున్నాడు. ప్రతిరోజులాగేే ఆదివారం అందరూ ఇంట్లో నిదురించారు. అర్ధరాత్రి దాటిం తర్వాత పేలుడు శబ్దం రావడంతో చుట్టపక్కల వారు లేచి వచ్చి చూశారు. అప్పటికే ఇంటి చెక్క తలుపు విరగగొట్టబడి అందులో నుంచి పదేళ్ల అనిల్, నాలుగేళ్ల చరణ్ మంటలతో బయటకు రావడం గమనించారు. వారి మంటలార్పే సమయంలో ‘అమ్మా, నాన్నలు మంటల్లో కాలిపోతున్నారు’ అని అనడంతో ఇంట్లోకి ప్రవేశించి వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణను కాపాడారు. సిలిండర్ వద్ద గ్యాస్ లీకై ఇంటి నిండా వ్యాపించి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వడ్డె నాగరాజు లేచి లైట్ వేయడంతోనో, బీడీ అంటించుకునే ప్రయత్నంలోనో పేలుడుతో కూడిన మంటలు రేగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు ధాటికి గోడలు బీటలు వారి, తలుపు విరిగి, ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడ్డాయి. తీవ్రగాయాలతో ఉన్న నలుగురిని హుటాహుటిన కృష్ణగిరి 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామానికే చెందిన గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ సుంకన్న సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. సిలిండర్ ఆఫ్ చేయకపోవడం, స్టవ్ నాబ్ పూర్తిగా కట్టకపోవడంతో గ్యాస్ లీకై నట్లు తెలుస్తోందన్నారు. తీవ్రగాయాలైన నలుగురికి దాదాపు 50 శాతం మేర గాయాలైనట్లు కర్నూలు జీజీహెచ్ వైద్యులు ధృవీకరించి చికిత్స అందిస్తున్నారు. వెల్దుర్తి పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి, గ్రామ నాయకుడు కాంతారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న కోరారు.
చరణ్
అనిల్
తీవ్రంగా గాయపడిన వడ్డె నాగరాజు, సువర్ణ