
మట్టి మిద్దె కూలి చిన్నారి మృతి
మంత్రాలయం రూరల్: మట్టి మిద్దె కూలి ఐదేళ్ల చిన్నారి లలిత మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామం బీసీ కాలనీకి చెందిన ఉలువ బీమరాయుడుతో పాటు భార్య బోయ నాగమ్మ, వారి కొడుకు రామాంజనేయులు, కుమార్తె శ్రావణి, మనవరాలు లలిత(5) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా తడిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలి పోయింది. పెద్ద ధ్వని రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చిన మట్టిని, జెంతలను తొలగించి కుటుంబ సభ్యులను బయటకు తీశారు. ప్రమాదంలో చిన్నారి లలిత స్పృహ కోల్పోయింది. నాగమ్మ, రామాంజనేయులు, శ్రావణి, భీమరాయుడికి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. లలిత స్పృహకోల్పవడంతో వెంటనే ఆర్‌ఎంపీని సంప్రదించగా మృతి చెందినట్లు తెలిపారు. గోనేగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రామాంజి దంపతుల కుమార్తె లలితను చదువు నిమిత్తం తాత భీమరాయుడు వద్ద ఉంచారు. తాత వద్ద ఉంటూ నర్సరీ చదువుతూ ఆటపాటలతో అలాడుతున్న చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్‌ఐ జనార్దన్‌రావు పరిశీలించి వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలు తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మట్టి మిద్దె కూలి చిన్నారి మృతి