
అనుమానం పెనుభూతమై!
● భార్యను కిరాతకంగా చంపిన భర్త
● తలపై ఇటుకతో మోది..
● మృతదేహాన్ని మిద్దైపె నుంచి
కిందకు పడేసిన వైనం
ఆళ్లగడ్డ: జీవితాంతం తోడు ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు.. ఏడు అడుగులు నడిచాడు. వారి అన్యోన్య దాంపత్యానికి నలుగురు పిల్లలు పుట్టారు. 20 ఏళ్ల తర్వాత భార్యపై అతనికి అనుమానం మొదలైంది. అది పెనుభూతమై చివరకు ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓలమ్మ (40)కి ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటకు చెందిన శేషగిరితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో అనుమానం పెనుభూతమైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో విసుగు చెందిన ఓలమ్మ వారం రోజుల క్రితం పుట్టినిల్లు ఆర్ కృష్ణాపురం చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం భార్య దగ్గరికి వచ్చిన ఆయన తనతో రావాలని చెప్పడంతో సోమవారం ఉదయం పోదామని చెప్పింది. కింది ఇంట్లో ఓలమ్మ తల్లి, అన్న నిద్రించగా ఓలమ్మ, భర్త శేషగిరిలు మిద్దైపె గదిలో నిద్రించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి భార్యను ఇటుకతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం మృతి చెందిన ఓలమ్మను మిద్దైపె నుంచి కిందకు విసిరి పడేసి అక్కడ నుంచి శేషగిరి పారిపోయాడు. ఏదో శబ్దం వచ్చిందని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా విగతజీవిగా పడిఉన్న ఓలమ్మను గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మురళీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి అన్న ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.