
బస్సులు కిటకిట
కొలిమిగుండ్ల: దసరా సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లులు అధిక సంఖ్యలో కొలిమిగుండ్ల, అవుకు బస్టాండ్లకు చేరుకున్నారు. వివిధ రకాల పనుల నిమిత్తం పోయే సాధారణ ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడంతో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ముందున్న స్జేజీల నుంచే ఓవర్‌లోడ్‌తో వచ్చాయి. చాలా మంది ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వచ్చింది. చిన్న పిల్లలు, గర్భిణులు బస్సులు ఎక్కలేని పరిస్థితి ఎదురైంది. వచ్చిన ప్రతి బస్సులో ఫుట్‌బోర్డు వరకు ప్రయాణికులే కనిపించారు. బస్టాండ్ల వద్ద గంటల సమయం వేచి చూసినా బస్సుల్లో ఏమాత్రం రద్దీ తగ్గలేదు. మార్గమధ్యలోనే పల్లెల్లో బస్సులు ఆపకుండానే వెళ్లాల్సి వచ్చింది. కండక్టర్లు టికెట్లు ఇచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.