శనగ విత్తు అందక రైతుకు బెంగ | - | Sakshi
Sakshi News home page

శనగ విత్తు అందక రైతుకు బెంగ

Oct 7 2025 3:53 AM | Updated on Oct 7 2025 3:53 AM

శనగ విత్తు అందక రైతుకు బెంగ

శనగ విత్తు అందక రైతుకు బెంగ

కర్నూలు (అగ్రికల్చర్‌): రబీ సీజన్‌ ప్రారంభమై వారం కావొస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. సెప్టెంబరు నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో రైతులు ముందస్తుగా శనగ సాగుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల పంపిణీలో చేతులెత్తేసింది. కేవలం కాగితాలపై శనగ విత్తనాల కేటాయింపు, ధర, సబ్సిడీలు ఖరారు అయ్యాయి. ఇంతవరకు రైతులకు విత్తనం అందని పరిస్థితి ఏర్పడింది.

ఏపీ సీడ్స్‌ నిర్వీర్యం

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్‌) శనగ విత్తనాలు సరఫరా చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ సీడ్స్‌ నిర్వీర్యం అయింది. 2024 ఖరీఫ్‌, 2024–25 రబీ, 2025 ఖరీఫ్‌ సీజన్‌లలో ఏపీసీడ్స్‌ సరఫరా చేసిన విత్తనాలకు సబ్సిడీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కొన్ని ప్రయివేటు విత్తన కంపెనీలు రైతులతో శనగ ఉత్పత్తి చేయిస్తాయి. ప్రభుత్వం టెండరు ద్వారా ఖరారు చేసిన ధరలకు ఈ కంపెనీలు ఏపీ సీడ్స్‌కు సరఫరా చేస్తాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ పాత బకాయిలను చెల్లించకపోవడంతో సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో నేడు విత్తన సమస్య తీవ్రమై కూర్చుంది.

యాప్‌ ఇవ్వకుండా ఆదేశాలు

శనగ విత్తనాలను ఈ నెల 3వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధం చేయాలని ఏపీసీడ్స్‌కు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందుకు యాప్‌ ఇవ్వలేదు. డీ క్రిషి యాప్‌ ఇస్తేనే రిజిస్ట్రేషన్‌లు మొదలవుతాయి. విత్తన పంపిణీకి వీలవుతుంది. యాప్‌ ఇవ్వకపోవడం, ప్రయివేలు విత్తన కంపెనీలు సహకరించకపోవడంతోనే విత్తనాల పంపిణీ దిశగా ఎలాంటి చర్యలు లేవు. కర్నూలు జిల్లాలో కౌతాళం, కోసిగి మండలాలు, నంద్యాల జిల్లాలో మహానంది, శిరివెళ్ల మండలాలు మినహా మిగిలిన అన్నిమండలాల్లో శనగ సాగు చేస్తారు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు వ్యాపారుల దగ్గర విత్తనాలు కొని సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఆలూరు ప్రాంతంలో శనగ విత్తనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

రూపాయి ఇవ్వకుండానే విత్తన సేకరణ

ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ ప్రతి ఏటా రైతులకు బ్రీడర్‌ సీడ్‌, సర్టిఫైడ్‌ సీడ్‌ ఇచ్చి విత్తనోత్పత్తి చేయిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో 2024 రబీలో విత్తనోత్పత్తి చేయించింది. విత్తనోత్పత్తి చేసిన 100 మందికిపైగా రైతుల నుంచి ఏపీ సీడ్స్‌ 10 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించింది. మామూ లుగా అయితే ఉత్పత్తి చేసిన విత్తనాలను సేకరించే సమయంలోనే అడ్వాన్స్‌ కింద క్వింటాకు రూ.5,000 ఆపైన చెల్లిస్తారు. ప్రభుత్వం విత్తనోత్పత్తి ధరలను ఖరారు చేసిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సారిగా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఏపీసీడ్స్‌ 10 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సేకరించింది. 2024 రబీలో విత్తనోత్పత్తి చేసిన రైతులకు మళ్లీ రబీ వచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. విత్తనోత్పత్తి చేసిన రైతులు అడ్వాన్స్‌ కోసం ఏపీ సీడ్స్‌ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

రబీ మొదలైనప్పటికీ ప్రారంభం కాని

సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ

పాత బకాయిలు చెల్లిస్తేనే

విత్తనాల సరఫరా అంటున్న

ప్రయివేటు విత్తన కంపెనీలు

విత్తనోత్పత్తి చేసిన రైతులకు

రూపాయి కూడా విదిల్చని వైనం

ఉద్దేశపూర్వకంగానే...

2019 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 20వ తేదీనే సబ్సిడీ శనగ విత్తన పంపిణీ జరిగేది. రబీ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం పూర్తయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రబీ సీజన్‌లో ఇదే సమయానికి 10వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సారి ఎలాంటి కదలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కూడా యాప్‌ వచ్చే అవకాశం లేదు. రాయలసీమకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండున్నర లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం లక్ష క్వింటాళ్లు కూడా కేటాయించలేదు. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement