
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆదోని టౌన్/ఆదోని రూరల్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం కర్నూలు జిల్లా నాయకులు రవిచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు గురునాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి తదితరులతో కలిసి సోమవారం ఆదోని మార్కెట్‌యార్డులో వారు పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పత్తి, వేరుశనగ, కంది తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. అరకొరగా వచ్చిన పత్తి దిగుబడులను సీసీఐ ద్వారా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులతో అత్యవసరంగా పంట నష్టం అంచనా వేయాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయ సెక్రటరీ గోవిందుకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు.