
ప్రైవేటీకరణపై ‘ప్రజా’గ్రహం
● జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు
భారీ ప్రదర్శన
● ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక
ఆధ్వర్యంలో ధర్నా
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వైద్య కళాశాలలను, ఆసుపత్రులను వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీఓ నెంబర్ 107/108 విడుదల చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలకు రానున్న రోజుల్లో వైద్యం అందక తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐక్య వేదిక కన్వీనర్ ఎం రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసనలో కే రామాంజనేయులు (చేతి వృత్తుదారుల సమాఖ్య), పీ రాధాక్రిష్ణ (సీఐటీయు), ఎస్ మనోహర్ మాణిక్యం (ఏఐటీయుసీ), భార్గవ్ ( పీఓపీ ), జహంగీర్ (ఎస్‌డీపీఐ), హరీశ్వరరెడ్డి (ఏడీఎస్‌ఓ), సుబ్బరాయుడు (డీటీఎఫ్), కే శేషాద్రిరెడ్డి (జనవిజ్ఞాన వేదిక), డేవిడ్ (ప్రజా పరిరక్షణ సమితి), వీ నాగరాజు (ఏపీ ప్రజా నాట్య మండలి), కే శివనాగిరెడ్డి (స్పార్క్), జయన్న (భవన నిర్మాణ కార్మిక సంఘం), వివిధ సంఘాల నాయకులు సాయి ఉదయ్, అబ్దుల్లా, శరత్‌కుమార్, బీసన్న, వెంకట్రామిరెడ్డి, సుంకన్న, వాడాల శేఖర్‌రెడ్డి, కే శేషగిరి, సీ రమేష్, డీ ఏసురాజు తదితరులు పాల్గొన్నారు.