
దేవరగట్టు.. భక్తిపారవశ్యం
● దేవరగట్టులో ఇనుప గొలుసు తెంపిన
గొరవయ్య
● నేడు నెరణికి చేరనున్న
ఉత్సవ విగ్రహాలు
హొళగుంద: వందలాది మంది గొరవయ్యల ఢమరుక నాదాలతో దేవరగట్టు ఆదివారం హోరెత్తింది. భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. శ్రీమాళ మల్లేశ్వరస్వామి సన్నిధానంలో ఆదివారం గొరవయ్యల నృత్యాలు అలరించాయి. గొలుసు తెంపుట ఆకట్టుకుంది. జైత్రయాత్ర అనంతరం సింహాసన కట్టమీద కొలువుదీరిన మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట దేవదాసిల క్రీడత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.
దైవ వచనాలు వల్లెవేస్తూ..
జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో గొరవయ్యలు దేవరగట్టుకు తరలివచ్చారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీదున్న స్వామి వారి ఉత్సవమూర్తుల ఎదుట పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమరుకాలను ఆడిస్తూ లయబద్ధంగా నృత్యం చేశారు. గురు గొరవయ్యలు చాటిలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెప్తూ పూనకంతో ఊగిపోయారు. కొందరుదైవ వచనాలు వల్ల్లెవేస్తూ అందుకు తగ్గట్టు హావభావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేశారు.
నాలుగు జఠికలకు తెగిన గొలుసు
ఉత్సవంలో భాగంగా ఇనుప గొలుసును హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగప్ప నాలుగు జఠికలకు తెంపాడు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన మల్లప్ప గుడి ఎదుట ప్రతి ఏటా ఇనుప గొలుసు తెంపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆదివారం దాదాపు 20 కేజీల బరువు ఉన్న గొలుసును నాలుగు జఠికలకు తెంపారు. దీంతో భక్తులు గొరవయ్యను భుజాల మీదెత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ఆనందంతో నృత్యాలు చేశారు. గతేడాది 51 జఠికలకు గొలుసు తెగితే ఈ ఏడాది నాలుగు జఠికలకే తెగడం పట్ల భక్తులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు.
వసంతోత్సవం.. కంకణ విసర్జన
ఆదోని, ఆలూరు, గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బసివినిలు క్రీడోత్సవం చేశారు. అనంతరం రంగు నీళ్లను భక్తులపై చల్లి వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలను నిర్వహించారు. మాళమల్లేశ్వర విగ్రహాలతో పాటు పల్లకీని భక్తులు ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆలూరు మండలాల ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, శ్రీనివాసులు, మారుతి తదితరులతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
నేటితో ముగియనున్న ఉత్సవాలు
దేవరగట్టులో ఉన్న శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సోమవారం గొరవయ్యలు కాలినడకన నెరణికి గ్రామానికి మోసుకెళ్తారు. ఉత్సవ విగ్రహాలను గ్రామ ఊరు వాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి వద్ద కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఊరేగింపు నిర్వహించి యథాస్థానానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

దేవరగట్టు.. భక్తిపారవశ్యం

దేవరగట్టు.. భక్తిపారవశ్యం

దేవరగట్టు.. భక్తిపారవశ్యం

దేవరగట్టు.. భక్తిపారవశ్యం