యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Oct 6 2025 2:10 AM | Updated on Oct 6 2025 2:10 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

తుగ్గలి: సూపర్‌ వాస్మాల్‌ తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఉప్పర్లపల్లికి చెందిన యలమంచి జస్వంత్‌(25) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదేళ్లుగా వైద్యం చేయిస్తున్నా తగ్గలేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో శనివారం గుత్తికి వెళ్లిన జస్వంత్‌ అక్కడే రసాయన ద్రావణాన్ని తాగి ఇంటికి వచ్చాడు. వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. జస్వంత్‌ తండ్రి చంద్రశేఖర్‌ ఏడేళ్ల క్రితం మృతి చెందారు. మృతుడి తల్లి దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్‌ఐ తెలిపారు.

వ్యక్తిపై గొడ్డలితో దాడి

స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

బాధితుడి పరిస్థితి విషమం

నంద్యాల: పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలోని గాంధీనగర్‌ వద్ద పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గాంధీనగర్‌ జంక్షన్‌ లోని ఓ దుకాణం వద్ద గట్టాల్‌ నగర్‌కు చెందిన సుభాన్‌ అనే వ్యక్తి కూర్చొని ఉండగా గాంధీనగర్‌కు చెందిన పరుశురాముడు గొడ్డలితో తలపై రెండు సార్లు నరికాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సుభాన్‌ చనిపోయాడనుకొని పరుశురాముడు నంద్యాల త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుభాన్‌ను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరి మధ్య వినాయక చవితి పండుగ సందర్భంగా డ్యాన్స్‌ విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని, పాత కక్షలతోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నెహ్రూనగర్‌లో ఘర్షణ

పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నెహ్రూనగర్‌లో శనివారం దుర్గామాత అమ్మవారి నిమజ్జన వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గ్రామంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహానికి గ్రామస్తులు నిమజ్జన వేడుకలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ట్రాక్టర్‌లో ఊరేగింపుగా తరలిస్తు చేస్తున్న డ్యాన్స్‌ విషయంలో ఓ సామాజిక వర్గానికి చెందిన గంగన్న, గణేష్‌, మద్దిలేటి, గిరిరాహుల్‌, మరో సామాజిక వర్గానికి చెందిన మధు, మహేష్‌, వంశీ, అనిల్‌, ప్రభాస్‌ల మధ్య వివాదం తలెత్తింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను మూర్వకొండ ఘాట్‌కు తరలించారు. అమ్మవారిని బ్యాక్‌వాటర్‌లో నిమజ్జనం చేసిన అనంతరం స్నానాలు చేస్తుండగా మధు, మహేష్‌, వంశీ, అనిల్‌, ప్రభాస్‌లు మూకుమ్మడిగా గంగన్న, గణేష్‌లపై పడి నీటిలో ముంచి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిడుతూరు ఎస్‌ఐ ఓబులేసు నిందితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.

కొనసాగుతున్న నీటి విడుదల

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిసరఫరా చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలోకి వరద కొనసాగుతుండగా సాయంత్రం ఆరుగంటల సమయంలో పోతిరెడ్డిపాడు వద్ద 883.20 అడుగుల నీటిమట్టం నమోదయ్యిందన్నారు. హెడ్‌రెగ్యులేటర్‌ 4వ గేటు నుంచి 1,500 క్యూసెక్కులు, ఎన్‌సీఎల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర నుంచి తెలుగుగంగ 4 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్‌ఎస్‌ఎస్‌)కాల్వకు 500, కేసీ ఎస్కేప్‌ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.

యువకుడి ఆత్మహత్య 1
1/1

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement