
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు దీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
శాస్త్రోక్తంగా శేర్తి పూజ
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు