
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణ మార్పులే కారణమా?
నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు.