
వైభవంగా గుర్రాల పార్వేట
మద్దికెర: దేశంలో మైసూరు తర్వాత ఎక్కడా లేని విధంగా మద్దికెరలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. విజయదశమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పార్వేట కార్యక్రమం అశేష జనవాహిని మధ్య వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దనగిరి, చిన్న నగిరి, యామనగిరి కుటుంబాలకు చెందిన యాదవ వంశీకులు రాజుల దుస్తులతో ఠీవిగా గుర్రాలపై కూర్చుని తమ వెంట ఆయుధాలు ధరించిన సైనికులతో ఊరేగింపుగా గ్రామ సరిహద్దులో ఉన్న రాగి మాను కట్ట వద్దకు వచ్చారు. అనంతరం గ్రామానికి 3 కి.మీ దూరంలో బొజ్జనాయుని పేట గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ప్రధాన రహదారిలో అశేష జనవాహిని మధ్య విజయం సాధించిన అశ్వాన్ని ప్రత్యేకంగా ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి గ్రామప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.