
పెత్తన, దౌర్జన్య కాలం
మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్రలో భక్తుల కర్రల సమరం
హొళగుంద: కర్రలు కరాళనృత్యం చేశాయి.. వందలాది తలలు పగిలాయి.. నలభై మందికి తీవ్రగాయాలయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. విజయదశమిని పురస్కరించుకుని హొళగుంద మండలం దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అనాదిగా వస్తున్న ఆచారమే కొనసాగింది. పోలీస్ నిబంధనలు, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా బన్ని ఉత్సవం సాగి రణరంగాన్ని తలపించింది. ఉద్వేగంగా, ఉత్కంఠ భరితంగా సాగిన కర్రల సమరంలో దేవరగట్టు రక్తసిక్తమయ్యింది.
పాలబాసతో ఒక్కటై..
మాళమల్లేశ్వరస్వామి జైత్రయాత్ర (ఊరేగింపు)కు ముందు మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామస్తులు గురువారం రాత్రి 11.30 గంటలకు డొళ్లిన బండ వద్దకు చేరుకున్నారు. వర్గ వైషమ్యాలు, పాత కక్షలు, వ్యక్తిగత మనస్పర్థలను వీడి మూడు గ్రామస్తులు కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకున్నారు. అనంతరం మూడు గ్రామాలకు చెందిన పెద్దలు కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు బండారం (పసుపు) ఇచ్చి వారి అనుమతి కోరారు. అధికారులు సమ్మతం తెలపడంతో డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండ పై ఉన్న స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మంత్రోచ్ఛారణలు, భక్తులు జయ జయ ధ్వనుల మధ్య మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరిపించారు.
డిర్రు..డిర్రు
కళ్యాణోత్సవం అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకీని ఊరేగింపుగా దిగువకు తీసుకు వస్తుండగా అక్కడే ఉన్న ఇతర గ్రామాలకు చెందిన కొందరు భక్తులు అటకాయించారు. అగ్గి కాగడాలు విసురుకున్నారు. కర్రల శబ్దాలతో, డిర్రు...డిర్రు అంటూ విగ్రహాలను మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపజేశారు. అనంతరం అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలై ఉద్వేగంగా, ఉత్కంఠంగా ముందుకు సాగింది. సత్య నారాయణ కట్ట, కాడసిద్దప్ప మఠం పరిసరాల్లో భక్తుల కర్రలు తగిలి ఎన్నో తలలు పగిలాయి. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. మొగలాయి ఆడుతున్న కొందరు అగ్గి కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు.
పల్లకీ వద్ద అలజడి
పదాల గట్టు వైపు జైత్రయాత్ర వెళ్తుండగా బసవన్న గుడి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద పల్లకీ మోస్తున్న వారితోపాటు చుట్టూ ఉన్న వారిపై రింగు కర్రలు, దివిటీలతో దాడి చేశారు. దీంతో పల్లకీ కింద పడిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో కొందరి తలలు పగిలి తీవ్ర రక్త గాయాలయ్యాయి. వారికి హెల్త్ క్యాంపులో చికిత్స అందించారు. నెరణికి, అరికెర గ్రామ భక్తుల మధ్య దాదాపు అరగంట పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకు ముందు మెట్ల వద్ద కూడా అలజడి నెలకొంది. అనంతరం విగ్రహాలతో జైత్రయాత్ర దట్టమైన అడవిలో సుమారు 6 కి. మీ పరిధిలో ఉన్న ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి శమీవృక్షం వద్దకు తీసుకెళ్లారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కర్రలు, మిగిలిన ఆయుధాలను ఉంచి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శమీవృక్షం మీదుగా మాళ మల్లేశ్వర విగ్రహాలతో ఎదురు బసవన్న గుడి వైపుకు బయలుదేరాయి. అక్కడ ఆలయ పూజారి గిరిస్వామి భవిష్యవాణి(కార్ణీకం) వినిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులను మల్లప్ప గుడిలోని సింహాసన కట్టమీద అధిష్టించి విజయ సూచకంగా భక్తులు చప్పట్లు కొట్టి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.
నేడు రథోత్సవం
దేవరగట్టులో శనివారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. అదేవిధంగా 5న గొరవొయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
పోలీసు బందోబస్తు ఉన్నా...
కర్రల సమరంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఈ ఏడాది కూడా అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. అనాదిగా వస్తున్న ఆచారమే పై చేయిగా నిలిచింది. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్, తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు, స్పెషల్ పార్టీలతో కలిసి మొత్తం కలిసి 800 మంది బందోబస్తు నిర్వహించారు. అల్లర్లుకు పాల్పడే వారిని గుర్తించడానికి వందల సంఖ్యలో సీసీ కెమరాలు, 4 డ్రోన్ కెమరాలు, దాదాపు 800 వరకు భారీ వెలుతురు ఇచ్చే లైట్లను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ ఏడాది చాలా మంది గాయపడ్డారు. ఇద్దరు మృతి చెందారు.
దేవరగట్టులో చిందిన రక్తం
కర్రల సమరంలో
100 మందికి పైగా గాయాలు
అందులో 40 మందికి తీవ్ర గాయాలు
ఇద్దరు మృతి...
మరి కొంతమంది పరిస్థితి విషమం
మెరుగైన చికిత్స కోసం ఆలూరు,
ఆదోనికి తరలింపు

పెత్తన, దౌర్జన్య కాలం

పెత్తన, దౌర్జన్య కాలం

పెత్తన, దౌర్జన్య కాలం

పెత్తన, దౌర్జన్య కాలం