
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద వైద్యుల ధర్నా
కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్‌లో పనిచేస్తున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పదోన్నతులు లేకుండానే రిటైర్ అవుతున్నారని, వెంటనే తమకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదన్నారు. తామేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన తమ డిమాండ్లను ఏళ్ల తరబడి అడుగుతున్నా పరిష్కరించడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం గత సంవత్సరం తమకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.మనోజ్, జాయింట్ సెక్రటరి డాక్టర్ మిథున్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.