
ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● రైతు బజార్ సర్కిల్ నుంచి చెక్‌పోస్టు వరకు రోడ్డు షో
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16న జిల్లాలో పర్యటించనున్నట్లు అందిన ప్రాథమిక సమాచారం నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటన అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ ప్రాథమిక సమాచారం మేరకు ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. నగరంలో 4వేల మందితో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందన్నారు. రైతు బజార్ సర్కిల్ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రోడ్ షో నిర్వహించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో సుందరీకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.