
ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
అధికారులకు కలెక్టర్ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు అప్రమత్తంగా ఉండి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో పంట కోత స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. పంట చేతికొచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకుని ట్రక్ షీట్ జనరేట్ చేసుకున్న తరువాతే మిల్లర్ల వద్దకు వెళ్లాలన్నారు. దళారులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు సృష్టించే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు అమ్మకుండా ధైర్యం చెప్పాలన్నారు. ఈ–పంట నమోదు 90 శాతం పూర్తయిందని నూరు శాతం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించి ధాన్యం సేకరణ, తేమశాతం కొలతలు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మిల్లులను తనిఖీ చేసి తేమ శాతం కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు. ధాన్యం సేకరణకు వినియోగించేందుకు 200 వాహనాలను సిద్ధం చేసి నమోదు చేయాలని ఇంకా మరిన్ని వాహనాలను వెంటనే నమోదు చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో గోనెసంచుల కొరత ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని సూచించారు. మిల్లుల నుంచి సీఎంఆర్ డెలివరీ పటిష్టంగా చేయాలని సూచించారు. ధాన్యం బస్తాల రవాణాకు హమాలీల కొరత రాకుండా చూడాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శివరామప్రసాద్, డీఎస్‌వో మోహనబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీసీవో చంద్రశేఖరరెడ్డి, జిల్లా రవాణాధికారి ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.