
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి అన్నారు.
నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆరవ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్ షిప్–2025–26 పోటీలను మంగళవారం ఆమె పరిశీలించారు. మెప్మా డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో ఓ వైపు దసరా ఉత్సవాలు, మరో వైపు జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరుగుతుండడంతో నగరానికి రెట్టింపు కళ వచ్చిందన్నారు. సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు బిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు అతిథులు పతకాలు అందజేసి అభినందించారు.
విజేతల వివరాలు..
సీనియర్ పురుషులు బాడీ ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్సీబీ)ప్రథమ, రాజేష్‌కుమార్ సోని (మధ్యప్రదేశ్) ద్వితీయ, దిలీప్‌కుమార్ (బీహార్) తృతీయ బహుమతులు పొందారు. జూనియర్ పురుషుల హ్యాండ్ బ్యాలెన్స్ వ్యక్తిగత విభాగంలో ఆయుష్ భౌమిక్ (పశ్చిమ బెంగాల్), రితిక్ బిష్ణోయ్ (రాజస్థాన్), బి.మనోజ్ (తమిళనాడు), బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో రాజ్ రాజోల్ (మధ్యప్రదేశ్), సౌనవ హజ్రా (సీఎస్‌ఎసీసీఈ), చందన్ శర్మ (బీహార్), జూనియర్ మహిళల బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో అనిక రాణా (ఉత్తరప్రదేశ్), ఎస్.హేమమాలిని (తమిళనాడు), అమృత సర్గులె (మహారాష్ట్ర), ఆర్టిస్టిక్ వ్యక్తిగత విభాగంలో రుద్రాక్షి భావె, రియా (మహారాష్ట్ర), రీత్ శ్రీవత్సవ్ (ఢిల్లీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు గెలుపొందారు.
శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి