
‘మీకోసం’కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే!
ప్రతి శనివారం మీకోసం అర్జీలు పరిశీలించుకోండి గడువు దాటిన అర్జీలు ఉంటే సహించేది లేదు సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలి అధికారులకు సూచనలు జారీ చేసిన జేసీ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలతో మీకోసం కార్యక్రమానికి అర్జీదారులు వస్తుంటారని ఇందుకోసం అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. మీకోసం కార్యక్రమం నిర్వహణ అనంతరం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారం పట్ల ఆయన సమీక్ష నిర్వహిస్తూ పోలీస్‌శాఖ నుంచి ఎక్కువగా పరిష్కరించాల్సిన అర్జీలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి అధికారి శనివారం ఆయా శాఖల పరంగా మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి అదేరోజు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గడువు దాటిన అర్జీలు ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకోసం కార్య క్రమానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో ఎం.రాధికను ఆదేశించారు. రెవెన్యూ తదితర శాఖలు ముఖ్యంగా జిల్లా ప్రగతికి ఎంతో తోడ్పాటును అందిస్తాయని, అయితే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శాఖ ఆయా శాఖల పరంగా జీఎస్టీకి సంబంధించిన వస్తువులు ఎంత మేరకు ధరలు తగ్గాయో, ఎంత మేరకు పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ప్రయోజనకరంగా ఉందో తప్పనిసరిగా ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుంచి క్షేత్రస్థాయి వరకు జీఎస్టీ చాంపియన్ పేరుతో ప్రతిభ చూపేందుకు ప్రభు త్వం మార్గదర్శకాలు నిర్దేశించిందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో జిల్లా ను అగ్రగామిగా నిలపాలన్నారు. దసరా నుంచి దీపావళి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందన్నారు. సచివాలయ స్థాయిలో కూడా సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచించారు.