
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
కోనేరుసెంటర్: విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చిలకలపూడికి చెందిన చలమలశెట్టి డూకేశ్వరరావు, నాగలలిత భార్యభర్తలు. డూకేశ్వరరావు రోల్డుగోల్డు వ్యాపారం చేస్తుంటాడు. వీరికి అక్షయ్‌వేణు(14)అనే కొడుకు ఉన్నాడు. భీమవరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న అక్షయ్‌వేణు దసరా సెలవులకు రెండురోజుల కిందట ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం డాబాపైకి వెళ్లిన అక్షయ్ ఎంతకీ కిందికి రాలేదు. అదే సమయంలో తండ్రి డూకేశ్వరరావు బయటికి నుంచి ఇంటికి వచ్చాడు. కొడుకు మేడ పిట్టగోడపై వాలి ఉండటాన్ని గమనించి కిందకు రమ్మని పిలిచాడు. అయినా పలుకకపోవడంతో వెంటనే మేడపైకి వెళ్లి తట్టి చూడగా విద్యుత్ షాక్ కొట్టినట్లు అనిపించింది. దీంతో కిందకి వచ్చి మెయిన్ ఆఫ్ చేసి మరలా మేడపైకి వెళ్లి అక్షయ్‌ను హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది అప్పటికే అక్షయ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం అక్షయ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
పేర్ని నాని, కిట్టు
సందర్శన..
అక్షయ్ మరణవార్త తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్షయ్ భౌతికకాయాన్ని సందర్శించారు. బాలుడి తండ్రి డూకేశ్వరరావుకు ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆసుపత్రి వద్ద ఉన్నారు. అక్షయ్ అకాలమరణం బాధిత కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. డూకేశ్వరరావు కుటుంబానికి ధైర్యం చెప్పి ఆయా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు సహాయంగా ఉండాలని స్థానిక నాయకులకు సూచించారు.