
జర్నలిస్టులకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు : జిల్లా ఎస్పీ
కోనేరుసెంటర్: జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొంది అన్ని అర్హతలు కలిగిన జర్నలిస్టులకు కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందజేసేందుకు నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు శుక్రవారం తెలిపారు. జిల్లా పోలీస్‌శాఖ–మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు చేరువగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఈ ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందజేస్తామన్నారు. మీడియా పేరుతో తప్పుడు కార్డులు చూపించి మోసాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి ఆట కట్టించేందుకు ఇదో అవకాశమని చెప్పారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయంపై పలు జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఆందోళనలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.వెంకట్రావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీప్తి మాట్లాడుతూ ఆందోళనలో భాగంగా శుక్రవారం ఆన్‌లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేశామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అక్టోబరు 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తామని వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ విజయకుమార్, కోశాధికారి డాక్టర్ బి.అరుణ్‌కుమార్, ఈసీ మెంబర్లు డాక్టర్ సూర్య, డాక్టర్ నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.